పురిపండా అప్పలస్వామి – రచయిత, కవి,బహు భాషా కోవిదుడు,

పురిపండా అప్పలస్వామి 13 నవంబర్ 1904లో శ్రీకాకుళం జిల్లాలోని సాలూరులో జన్మిం చారు.

గిడుగు రామమూర్తిగారి వ్యావహారికాంధ్రోద్యమ వారసుడు, బహుభాషా కోవిదుడు, రచయిత, కవి, సంఘసంస్కర్త, స్వాతంత్ర సమర యోధుడు అయిన బహుముఖ ప్రజ్ఞాశాలి పురిపండా. ఆంధ్ర, సంస్కృతాలలోనే గాక ఒరియా, హిందీ, బెంగాలీ, ఆంగ్ల భాషలలో సమధిక పాండిత్యాన్ని ఆర్జించారు.

గాంధీజీ చేపట్టిన ఉద్యమాలలో సహాయ నిరాకరణ ఉద్యమం ,హరిజనోద్యమం, ఖాదీ ప్రచార ఉద్యమం ,భాషా ప్రచారం ఉద్యమాల్లో చురుగా పాల్గొన్నారు. విశాఖపట్నంలోని అఖిల భారత చరక సంఘంలో నిర్వాహకుడిగా కూడా పనిచేశారు. జర్నలిస్టుగా ఆయనకు విశిష్టమైన సేవలు అందించారు .

మొదట ఈయన విశాఖలో వెలువడిన జాతీయ వార్తాపత్రిక ‘స్వశక్తి’ పత్రికకు సహాయ సంపాదకులుగా పనిచేశారు.12 సంవత్సరాల పాటు ఆంధ్ర పత్రికలో కాలమ్స్ రాయడమే కాకుండా, ‘సత్యవాణి’ అనే పత్రికను నిర్వహించారు.

1928 వరకు ఈయన గ్రాంథిక భాషావాది. గిడుగు వారి ప్రభావంవల్ల వ్యావహారిక భాషావాదిగా మారారు.

‘రాట్నపతాకం’ వీరి తొలిరచనకాగా , ‘సౌదామిని’ వీరికి పేరుతెచ్చిన రచనా కావ్యం. ఇది ఇంగ్లీష్ భాషలోకి కూడా అనువదించ బడింది. వీరు ప్రచురించిన ‘వైశాఖి’ మాసపత్రిక సారస్వత ప్రియుల మన్ననలను ఆర్జించింది.

భాషావేత్తగా, ఆయన వివిధ భాషలపై పుస్తకాలు రాశారు. ఆయన ప్రచురించిన కొన్ని రచనలు – శ్రీమద్భాగవతం, వాల్మీకి రామాయణం, మహాభారతం, శ్రీదేవి భాగవతం, బెంగాలీ సాహిత్య చరిత్ర, రత్న పతకం, విశ్వ కళా వేదిక, మొహమ్మద్ చరిత్ర, సౌదామిని, జగద్గురు శంకరాచార్య, హంగరీ విప్లవం మొదలైనవి.

వీరు ఎన్నో ఒరియా గ్రంథాలను తెలుగులోకి అనువదించారు  ముఖ్యంగా ‘అమృత సంతానం’, ‘మట్టి మనుషులు” అనువదించారు. విశాఖ రచయితల సంఘానికి కొంతకాలం అధ్యక్షుడు గా పనిచేశారు . మహా భారతాన్ని వచనంలో రాశారు. వచన మహాభారతాలలో ఇప్పటికీ దానిదే అగ్రస్థానం. ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ వీరికి గౌరవ సభ్యత్వం ఇచ్చి గౌరవించింది.

భావి తరాలకు స్ఫూర్తిగా శ్రీశ్రీ మరి కొందరితో కలిసి కవితా సమితిని స్థాపించారు. కాని దానికి కర్త కర్మ క్రియ అంతా పురిపండా అప్పలస్వామినే . గొప్ప వ్యవహారదక్షుడు. కవితాసమితి తరఫున మొదట ప్రచురించ బడిన కవిత శ్రీశ్రీ ప్రభవ. దీనికి అప్పలస్వామే ముందు మాట రాశారు. ప్రముఖ తెలుగు రచయిత శ్రీరంగం శ్రీనివాసరావు రచనా ప్రతిభను కనుగొన్న ఘనత కూడా ఆయనకు దక్కుతుంది.

గ్రంథాలయోద్యమంలో వీరు సాగించిన కృషి గణనీయం. మంతెన ఆదినారాయణ స్వామి స్థాపించిన ఆంధ్రప్రదేశ్ ప్రథమ గ్రంథాలయాన్ని, ‘కవితా సమితి’ గ్రంథాలయాన్ని ఆయన చక్కగా అభివృద్ధి  పరచారు. శ్రీరామవరం, పార్వతీపురంలలోని గ్రంథాలయాలను చాలా అభివృద్ధి చేశారు. మరకాం గ్రామంలో ఒక గ్రంథాలయాన్ని స్థాపించారు. ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ సంఘ యావజ్జీవ గౌరవ సభ్యులుగా వీరు ఎన్నుకోబడినారు. ఈయన అభ్యుదయ రచయితలకు మార్గదర్శి.

1973లో ఆంధ్ర విశ్వవిద్యాలయం ఆయనకు కళాప్రపూర్ణ అవార్డును ప్రదానం చేసింది. ఈయన తన 78వ ఏట నవంబరు 18, 1982లో మరణించారు.

పురిపండ అప్పలస్వామి  2005 శతజయంతి ఉత్సవాలు జరుపుకుంటున్న సందర్బంగా పురిపండ జీవితం మరియు కాలాలపై ద్వానా శాస్త్రి మరియు బండి సత్యనారాయణ రచించిన పుస్తకాన్ని విడుదల చేసిన పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఉపకులపతి ఎ. మంజులత మాట్లాడుతూ, పురిపండ సంస్కృతం, తెలుగు మరియు ఆంగ్ల భాషలలో బాగా ప్రావీణ్యం ఉన్న గొప్ప పండితుడని అన్నారు.

ఈ‌ కార్యక్రమంలో లోక్ నాయక్ ఫౌండేషన్ అధ్యక్షుడు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ మాట్లాడుతూ,   తెలుగు మాట్లాడే భాషను ప్రోత్సహించి, ప్రజలకు సాహిత్యాన్ని చేరువ చేసిన అత్యుత్తమ పండితుడు మరియు సాహితీవేత్త అని ప్రశంచించారు.

శ్రీశ్రీని పరిచయం చేసి ప్రోత్సహించిన ఘనత పురిపండకే చెందాలని డాక్టర్ ద్వానా శాస్త్రి అన్నారు. తెలుగు భాష మరియు సాహిత్యానికి ఆయన చేసిన కృషిని భావితరాలు గుర్తించి స్మరించుకోవాలి. పురిపండా జీవితం మరియు సాహిత్యం నుండి ప్రేరణ పొంది, అతను మరియు అతని శిష్యుడు (బండి సత్యనారాయణ) ఈ చిన్న జీవిత చరిత్రను వెలువరించారు.

పురిపండ అప్పలస్వామి  చేసిన సేవలకు గుర్తుగా 2005లో శతజయంతి సందర్భంగా విశాఖపట్నంలోని బీచ్ రోడ్డులో ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేశారు.