ధూపం సూర్యలింగం
దేశంలో గొప్ప నృత్య రూపాల్లో ‘పేరిణి’ నృత్యం ఎంచదగ్గది. ‘పేరిణి నృత్యహేలని ప్రపంచానికి పరిచయం చేసిన నటరాజ రామకృష్ణకి దేశవ్యాప్తంగా ఎందరో శిష్యులు ఉన్నారు. శ్రీకాకుళం జిల్లా సంతకవిటి మండలం బొద్దూరుకు చెందిన ధూపం సూర్యలింగం జిల్లాలో పేరెన్నికగన్న పేరిణి నృత్య కళాకారుడు. నటరాజ రామకృష్ణకు ఆయన కుడిభుజం. మృదంగం ఆయన నిర్దేశించినట్టే పలుకుతుంది. ద్రుపదబాణీ తెలిసిన అతికొద్దిమందిలో ఆయన ఒకరు. ఆయన వేళ్లలో నాదం వుంది. ‘పేరిణి’ ఆయనే పునఃప్రాణం పోశారు. ఓంకార నాదాన్ని సునాయాసంగా పలికించే సమర్థుడు.
ధూపం పెద అప్పలస్వామి, చెన్నమ్మలకు 1919 సెప్టెంబరు 21వ తేదీన జన్మించారు. ఆంధ్ర, అమరాలు చదివి తూర్పు భాగవతంలో ‘రాధ’ పాత్రతో ఆరంగేట్రం చేసి వయసుతో పాటు సహజంగా గాత్రంలో జరిగిన మార్పువల్ల రాధ పాత్రకు గాత్రం సరిపడకపోవడంతో తన 14వ యేట బూరాడకు చెందిన ధర్మవరం అప్పలస్వామి వద్ద శిష్యునిగా చేరి మృదంగ అక్షరాభ్యాసం చేసి, మూడు సంవత్సరాల కాలంలో మార్ధంగేకునిగా తిరిగి రంగ ప్రవేశం చేసి ‘ధూపం శైలి’ అని చెప్పుకునే మార్దంగీకునిగా ఎదిగారు.
తూర్పు భాగవతానికి ఆదరణ తగ్గుతున్నప్పటికీ కేవలం ఈయన మృదంగనాదం వినిందే శ్రోతలు వచ్చేవారంటే ధూపం వారి ప్రత్యేకత ఆయన వాదనం, నాదం గురించి విన్న భరత కళాప్రపూర్ణ నటరాజ రామకృష్ణ స్వయంగా వచ్చి బొద్దూరులో బొంతలు కుట్టుకుంటున్న ధూపంవారిని కలసి ఓరుగల్లులోనున్న రామప్ప దేవాలయాన్ని సందర్శించి అక్కడ శిల్పాకృతులను చూపించడంతో పద ఆకృతులను చూసి ‘జతులు’ కూర్చి ‘పేరిణి’ నృత్యాన్ని పునర్జీవనం కల్పించేందుకు కృషిచేశారు.
ఈ విషయం నటరాజు గారి జీవిత కాలంలోనే ఈ రచయితతో ఫోనులో తెలపడం, ధూపంవారి మరణవార్త తెలియగానే శోకతప్తుడవడం జరిగింది. నడుమునకు మృదంగాన్ని కట్టుకుని ఏకబిగిన 4, 5 గంటలు మృదంగాన్ని వాయించడం తన మృదంగవాదనంలో, ప్రణవనాదం సృష్టించడం ఉరుములు పిడుగులు వంటి శబ్దాలను సృష్టించడం ఆయనకే చెల్లింది.
ఈయన మృదంగ సహకారం పొందిన భామ, విజయనగరానికి చెందిన వరదా ఆదినారాయణ భాగవతార్, నిమ్మలవలసకు చెందిన మాడల శంకరయ్య భాగవతార్, తోణంగి సీతారాపురానికి చెందిన గానకోకిల వానపల్లి పరదేశి భాగవతార్ కలియుగ సత్యభామగా పేరొందిన చౌడువాడకు చెందిన చేబ్రోలు సన్యాసయ్య, మూడు దశాబ్దాలపాటు నిరాఘాటంగా కోమటిపల్లి బొంతలకోటి జగన్నాథంవంటి తూర్పు భాగవతులకు తన మృదంగ సహకారం అందించారు.
ఆంధ్రప్రదేశ్ సంగీత నాటక అకాడమీకి ఎనిమి దేళ్లు తన మృదంగ సహకారాన్ని అందించారు ధూపం. మాజీ రాష్ట్రపతి వి.వి.గిరి, మాజీ గవర్నర్ బెజవాడ గోపాలరెడ్డిల సమక్షంలో బెంగుళూరులో తన ప్రదర్శనకు వారి ప్రశంసలు లభించడం, చిదంబరం నటరాజ దేవాలయంలో, మహాశివరాత్రి పర్వదినాన, ద్రాక్షారామం, కాళహస్తి, తిరుమల, తిరుపతి, శ్రీశైలంలో ఆయన ప్రదర్శనలు జరిగాయి. హరిద్వార్ కుంభమేళా సందర్భంగాను, వివేకానంద ఆశ్రమంలో ప్రదర్శనలు ఆయనకు తృప్తినిచ్చాయి. సహధర్మచారిణి సన్యాసమ్మతో మహాశివరాత్రి పర్వదినాన దంపతులిరువురూ కుక్కిమంచాలపైన శివైక్యం చెందడం అపురూప సంఘటన. ఆయన మన జిల్లావాసి కావడం జిల్లా అదృష్టం.