కూర్మాపు నరసింహం – విశిష్ట చిత్రకారుడు

కూర్మాపు నరసింహం మంచి చిత్రకారుడు . కుంచెతో కోటి భావాలు పలికించగల మహా వ్యక్తి . వర్ణ చిత్రాలతో శ్రీకాకుళం జిల్లా కీర్తిని జాతీయ స్థాయిలో ఇనుమడింపజేసిన విశిష్ట ప్రతిభా వంతుడు .

శ్రీకాకుళం జిల్లా సంతకవిటి మండలం గుళ్ల సీతారాంపురం గ్రామంలో కూర్మాపు నరసింహం  1902 నవంబర్ 2న జన్మించారు. చిట్టిమాచార్య వద్ద రంగుల ఓనమాలు దిద్ది సహజత్వానికి చేరువలో ప్రకృతి అందాలు రవివర్మకు ధీటుగా చిత్రాలు గీసి తన ఖ్యాతిని, శ్రీకాకుళం ఖ్యాతిని దేశవ్యాప్తంగా చాటిచెప్పారు. రూపచిత్రణలో నరసింహంది అందెవేసిన చేయి. వీరి నేతాజీ చిత్రం నేటికి నిత్య నూతనంగా వుంటుంది. వీరు చిత్రించిన రంగుల బాలాజీ చిత్రం తిరుపతి దేవస్థానం ప్రత్యేక ప్రశంసలందుకొంది.

గాంధీ గారిని శ్రీకాకుళం, దూసి  పర్యటనలో చిత్రకారుడు కూర్మాపు చూసి  , గాంధీ గారి  నిలువెత్తు చిత్రపటాన్ని చిత్రించి, దాన్ని గాంధీజీకి అందించి ప్రశంసలు అందుకొన్నారు. వంశధార ప్రాజెక్టుకు రూపకల్పన చేసి నెహ్రూకు చూపించిన అభ్యుదయవాది. జపాన్లోని టోక్యోకు చెందిన బౌద్ధ బృందం శాలిగుండంలోని బౌద్ధ అవశేషాల్ని తిలకించి, నరసింహం ఆర్ట్ గ్యాలరీని 1981 డిశంబర్ లో తిలకించి మంత్ర ముద్గులైనారు , అందులో గల “బుద్దుని క్షీరనివేదనం” చిత్రంను చూసి  అక్కడ వారు  సాష్టాంగ నమస్కారం చేశారంటే అది ఆయన చిత్ర కళకు  ప్రతిభకు నిదర్శనం.

కూర్మాపు వారి ప్రతిభ, ప్రజ్ఞకు ప్రమాణాలుగా నిలిచిన కొన్ని అపూర్వ చిత్రకళాఖండాలు శ్రీకాకుళంలోని శ్రీ నాగేశ్వరా ఫొటో స్టూడియో ఆవరణలో ఏర్పాటైన ఆర్డు గ్యాలరీలో కనిపిస్తాయి.  శ్రీశైలం భ్రమరాంబిక ఆలయంలో నరసింహం గీసిన ” ఛత్రపతి శివాజీ కి వీరఖడ్గం అందిస్తున్న భ్రమరాంభికాదేవి ” చిత్రపటాన్ని తిలకించిన అప్పటి ప్రధాని ‘ జవహర్ లాల్ నెహ్రూ ‘ ఈ చిత్ర కారుడుని నేను చూడాలని ఉంది అన్నారంటే నరసింహం చిత్ర కళా భావం ఎంత ఉన్నతమైనదో అవగతము కాగలదు . మల్లెపువ్వుల్లాంటి నేత చీరల్లో అంతుపట్టని హావభావాలతో రంగుదాల్చిన ముగ్ద మనోహరిని ‘ సుందరమూగా చిత్రీకరించారు .  నరసింహం చేతి నుంచి జాలువారిన  చిత్రాలు యింకా హైదరాబాద్ లోని సాలార్‌జంగ్ మ్యూజియంలోనూ, విశాఖ ఆంధ్ర విశ్వవిద్యాలయంలోనూ వున్నాయి.

ఆయన సోదరుడు అప్పారావు కూడా చిత్రకారుడే. నరసింహం 1968 సెప్టెంబర్ 28 న పరమపదించారు. ఆయన కుమారుడు బుచ్చిబాబు ఆధ్వర్యంలో 2002లో నరసింహం శతజయంతి జరిగింది. ఈ సందర్భంగా ఒక విశిష్ట సంచికను ఆయన వర్ణ చిత్రాలు, ఫొటోలతో ప్రచురించారు.