
(భావశ్రీ) వాండ్రంగి రామారావు ఆంధ్ర ప్రదేశ్ , శ్రీకాకుళం జిల్లా, పొందూరు సమీపంలో సంతవురిటి గ్రామంలో 1935 జనవరి 26న సూర్యనారాయణ (మానవతావాది, సామాజిక సేవకులు), అమ్మన్నమ్మ (గృహిణి) దంపతులకు జన్మించారు . తెలుగు భాషలో ప్రత్యేక బి.ఎ డిగ్రీతో ఉత్తీర్ణుడైన భావశ్రీ తెలుగు, సంస్కృతంతో పాటు హిందీ, ఆంగ్ల భాషలలో కూడా ప్రవేశం ఉంది. వాండ్రంగి రామారావు సాహితీ వేత్త, గ్రంథ రచయితగా, వ్యాఖ్యాతగా రామారావు జీవనయానం
ఈయన 13వ ఏట నుంచే రచనలు ప్రారంభించారు. వృత్తి రీత్యా తెలుగు పండితుడిగా వేలాది మంది శిష్యులను తయారుచేశారు. వృత్తిపై ఉన్న మక్కువతో ఉద్యోగ విరమణ అనంతరం కూడా రాజాం సెయింటాన్స్ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో తెలుగు ఉపాధ్యాయుడిగా విధులు నిర్వ హించారు. అనేక గ్రంథ రచనలు చేయడంతో పాటు వివిధ భాషల్లో ఉన్న సాహిత్యాన్ని ఆంధ్రీకరించి విశిష్ట మన్ననలను అందుకున్నారు. సుదీర్ఘకాలం ప్రముఖ పత్రికల్లో పాత్రికేయుడిగా వ్యవహరించి ప్రజా సమస్యలను ప్రతిబింబించేలా కథనాలు రాశారు.
శ్లోకం, పద్యం, గద్యం, కవిత్వం, నవల, కావ్యం, నాటిక, నాటకం, వ్యాసం ఇలా అనేక రంగాల్లో విశేష ప్రతిభ కనబరిచి ఎందరో మహనీయుల ప్రశంసలు అందుకున్నారు భావశ్రీ. సొంతపేరు రామారావు అయినా భావశ్రీగానే ప్రసిద్ధి పొందారు.
రచయితగా…
పంచవటి, రుక్మిణి కృష్ణ, హృదయవీణ, వెన్నెల వెలుగులు, భారత రామాయణం, షేక్‌స్పియర్ రాగాలు, పారిజాత పరిమళాలు, కాదేదీ కవితకనర్హం, మానవా.. ఇంకా మానవా, స్వాతంత్య్రరథం, జీవితచక్రం వంటి 70కి పైగా విభిన్న సాహితీ ప్రక్రియలు, సంగీత రూపకాలు, నాటి కలు, నాటకాలు రచించారు. సజీవ మూర్తులు, శాంతిసమరం, బందరు పిచ్చోడు, అగ్నిశిఖరం వంటి చిత్రాలకు గీతరచన చేశారు. ఎస్‌సీఈఆర్టీ, ఎన్‌సీఈఆర్టీ పుస్తక రచనల్లో పాలుపంచుకున్నారు. ఆకాశవాణిలో 500కి పైగా ప్రసంగాలు చేశారు. ఈయన రచించిన గోదా గీతమాలిక ఆంధ్రీకరణ గ్రంథాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ముద్రించింది.
అవార్డులు ఇలా..
భావశ్రీ ఉత్తమ తెలుగు ఉపాధ్యాయుడిగా 1987లో అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీరామారావు చేతుల మీదుగా అందుకున్నారు.
1993లో ఏపీ శిష్టకరణ అసోసియేషన్‌చే కళాబంధు పురస్కారం..
2002లో విశాఖలో నాట్యరవళి ప్రతిభ.. 2003లో విశాఖలో కళారత్న…,
2006లో పలాస- కాశీ బుగ్గలో లలిత కళారంజని వారిచే సాహిత్య బంధు..
2008లో తెలుగు నాటకరంగ దినోత్సవంలో ఉత్తమ కవిగా..
2009లో బొబ్బిలి విజ్ఞాన వివర్థిని పరిషత్ వారిచే సాహితీ, కవితా..
20012లో హైదరాబాద్‌లో కౌముది సంస్థ వారిచే..
2012లో తిరుపతిలో నిర్వహించిన ప్రపంచ తెలుగు మహాసభలో కవితా సమ్మేళనంలో పురస్కారాలను అందుకున్నారు.
వాండ్రంగి రామారావు (87) (భావశ్రీ) 3 డిసెంబరు 2021 శుక్రవారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో స్వగ్రామం జి.సిగడాం మండలం సంతవురిటిలో స్వగృహంలో స్వర్గస్తులయ్యారు.