
రోణంకి అప్పలస్వామి టెక్కలిని అంతర్జాతీయ సాహితీ ప్రపంచానికి పరిచయం చేసిన బహుముఖ ప్రజ్ఞాశాలి
అప్పలస్వామిగారు శ్రీకాకుళంజిల్లా టెక్కలి సమీపంలోని ఇజ్జవరం అనే గ్రామంలో 1909 సెప్టెంబరు 15న తండ్రి రోణంకి నారాయణ్ , తల్లి – రోణంకి చిట్టెమ్మ లకు జన్మించారు.. తండ్రి పెట్టిన పాఠశాలలో ప్రాథమిక విద్య ముగించుకుని, విజయనగరం, కాశీ హిందూ విశ్వవిద్యాలయాల్లో చదువులు పూర్తిచేసి ఎం.ఏ. (ఇంగ్లీషు) పట్టభద్రులయ్యారు. తరువాత కాలంలో చదువుకున్న చోటే విజయనగరం మహారాజు కళాశాలలో సుమారు 30ఏళ్ళు వివిద హోదాల్లో భోదన చేసి ,ఇంగ్లీషు శాఖాధిపతిగా 1969లో రిటైరయ్యా రు. ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఎమెరిషస్ ప్రొఫెసర్‌గా రెండేళ్ళు పనిచేశారు. తరువాత టెక్కలిలో స్వగృహం నిర్మించుకుని స్థిరపడ్డారు.
మూడో ఫారం చదువుతుండగానే పోతన భాగవతంలోని ఘట్టాలను కంఠస్థం చేసిన అప్పలస్వామి, తర్వాత కాలంలో ప్రపంచమే నివ్వరపోయేటంత బహుభాషావేత్తగాఎదిగారు. ఆంగ్ల బాష పై మక్కువతో బాల్యం నుంచే చదువుకొనేవారు , విశ్వకవి టాగోర్ , ఇండియన్ నైటాంగిల్ సరోజినీ నాయుడు ఆంగ్లంలో రచనలు చూసి , వారిని స్ఫూర్తిగా చేసుకొని కవిత్వం మొదలుపెట్టారు .
ఒక వైపు ఆంగ్ల అధ్యాపకునిగా ఉంటూనే ఫ్రెంచ్, స్పానిష్, గ్రీకు, హీబ్రూ, ఇటాలియన్ మొదలైన ఆరు యురోపియన్ భాషలలో ఆధ్యయనంచేశారు. ఆయా భాషల్లో కవితలు, రచనలు చేయడమే కాకుండా అనువాదాలూ చేశారు. గ్రామ్ ఫోన్ పెట్టుకొని జర్మన్, లాటిన్ వంటి భాషల్లో నైపుణ్యం సంపాదించారు. హిందీ, ఒడియా, కన్నడం, బెంగాలీ వంటి భారతీయ భాషల్లో సైతం అసర్గళంగా మాట్లాడే శక్తి సొంతం చేసుకున్నారు.
శ్రీశ్రీ, ఆరుద్రలకు తొలి రోజుల్లో స్ఫూర్తినిచ్చిన వారు. అల్లసాని పెద్దన, భట్టుమూర్తి, క్షేత్రయ్య మొదలు శ్రీశ్రీ, నారాయణబాబు, చావలి బంగారమ్మ, చాసో మొదలైనవారి కవితల్ని ఆంగ్లీకరించి దేశ, విదేశీ భాషా పత్రికల్లో ప్రచురించారు.
అభ్యుదయ, అవగాహన, ఆంధ్రజ్యోతి, ఆంధ్రపత్రిక, భారతి, ఆంధ్రప్రదేశ్, కళాకేళి, ప్రజారధం, సృజన మొదలగు పత్రికలలోనూ అనేక ప్రత్యేక సంచికల్లోనూ వ్యాసాలు ప్రచురించారు. సమాచారశాఖ వారికోసం కోడి రామమూర్తిపై చిన్న పుస్తకం రచించారు. కేంద్ర సాహిత్య అకాడమి కోసం మాకియ వెల్లీ ”ప్రిన్స్”ను – నేరుగా ఇటాలియన్ భాషనుండి తెలుగు చేశారు. మానేపల్లి, చిత్రభాను, మోహనప్రసాద్, చాగంటి తులసి – మొ||వారి పుస్తకాలకు ముందుమాటలు రాశారు. ఆరుద్ర తన తొలి కావ్యం -‘త్వమేవాహం’నూ మానేపల్లి తన తొలి కవితా సంపుటి ‘వెలిగించే దీపాలు’ను గురువుగారికి అంకితం ఇచ్చారు. 1980ల్లో ఆధునిక కవితా పితామహుడు గురజాడ అనీ, శ్రీశ్రీ తానే పితామహుడిననడం తగదని – జరిగిన వాదోపవాదాలకు గట్టి సమాధానం చెప్పారు. విశాఖపట్నం ఆకాశవాణి నుండి తెలుగు, ఇంగ్లీషులలో పలు ప్రసంగాలు చేశారు. రావూరి భరద్వాజగారు – ప్రత్యేకంగా ఆయన చేత హైదరాబాద్ ఆకాశవాణి కేంద్రాలనుండి ప్రసంగాలు చేయించారు.
1935లో ”సాంగ్స్ అండ్ లిరిక్స్” పేర తన కవిత్వాన్ని, తానే రాసుకున్న ముందుమాటతో, స్వార్జితధనంతో అచ్చువేసుకున్నారు. అమ్మ లేదు. 1935 నుంచీ 1987లో మరణించే వరకూ తన మిత్రులకు, పంచిపెట్టారు. విశాఖపట్నం రచయితల సంఘం వారు 1985లో మేస్టారి ఇంగ్లీషు కవిత్వాన్ని ”నాక్ అండ్ అదర్ పోయమ్స్” పేర అచ్చు వేశారు
టెక్కలి వారి స్వగృహంలో వివిధ యురోపి యన్ భాషలకు చెందిన అరుదైన గ్రంథాలు ఇప్పటికీ అలాగే వున్నాయి. వాటిని విశాఖనగర పౌర గ్రంథాలయానికి తరలించాలన్న ప్రయత్నాలు ఇంకా ఫలించలేదు. ఆయన రచనలు ఎన్నడూ జాగ్రత్త చేయలేదు. పోయినన్ని పోగా మిగిలిన తెలుగు, ఇంగ్లీషు రచనల్ని పుస్తకంగా తీసుకువచ్చే ప్రయత్నాలు మొదలయ్యాయి.
4 మార్చి 1987 నాడు మరణించారు .
అరసం తొలితరం ప్రముఖులు, రాష్ట్రశాఖ అధ్యక్షవర్గ సభ్యులూ అయిన రోణంకి అప్పలస్వామి గారి శతజయంతి ఈ 2009 సెప్టెంబరు 15న జరుపుకున్నారు