శ్రీకాకుళం జిల్లా చరిత్రలో తాండ్ర పాపారాయుడు పేరు ప్రస్తావించాల్సిందే. తాండ్ర పాపయ్య కోట రాజాంలో ఉండేది. విజయరామరాజు బొబ్బిలి కోటను ధ్వంసం చేసి స్వాధీనం చేసుకోవడంతో కోటలోని అంతఃపుర స్త్రీలు అగ్నిలో దూకి ఆత్మహుతి చేసుకున్నారని చారిత్రక ఆధారాలు తెలుపుతున్నాయి. ఆత్మహత్య చేసుకున్న బొబ్బిలి రాణి తాండ్ర పాపారాయుడికి స్వయానా సోదరి. బొబ్బిలి పతనం తెలుసుకున్న తాండ్ర పాపయ్య రాజాం నుంచి హుటాహుటిన బొబ్బిలి వెళ్లి అక్కడ విజయరామరాజును చంపడం కూడా చారిత్రక ప్రసిద్ధమే. బొబ్బిలిపులి తాండ్ర పాపారాయుడు నివసించిన వీరగెడ్డ రాజాం ప్రాంతంలో రాజుల తీపిగురుతులు నేటికీ ఉన్నాయి.
- ‘కోట‘లో కోర్టు
నాడు తాండ్ర పాపారాయుడు కొలువున్న రాజాంలోని కోటలో ఇటీవల కాలం వరకు జూనియర్, సీనియర్ న్యాయస్థానాలు నిర్వహించేవారు. నేటికీ కోర్టులో దసరా ఉత్సవాలను చేయడం ఆనవాయితీగా వస్తోంది. తాండ్ర కొలువున్న రోజుల్లో కోటను కాపాడే శక్తిని కోటదుర్గ అనేవారని, ఈ కోటలో భేతాళుడు ఉన్నాడని పెద్దలు చెప్పేవారు. ఇప్పటికీ కోటకు వెళ్లే మార్గంలో రెండువైపులా రెండు ఫిరంగుల గొట్టాలున్నాయి. కోటచుట్టూ పెద్ద కందకం ఉండేదని వృద్ధులు చెబుతారు. ప్రస్తుతం బస్టాండ్‌గా వినియోగిస్తున్న మల్లమ్మచెరువును ఆనుకుని ఉన్న గుర్రమ్మచెరువులో గుర్రాలు నీళ్లు తాగేవని చారిత్రక ఆధారాలున్నాయి. కోట నుంచి చిన్నచెరువు వరకు సొరంగమార్గం ఉండేదని, ఆ మార్గంపైనే నేడు మాధవబజార్ రహదారి నిర్మితమైందని ప్రచారం ఉంది. కోటలోని స్త్రీలు సొరంగమార్గం ద్వారా చిన్నచెరువులోకి వెళ్లి స్నానాలు చేసేవారని వృద్ధతరం చెబుతుంటుంది.
- ఠాణాలో తహశీల్దారు కార్యాలయం
తాండ్ర పాపారాయుడు రాజాంలో ఉన్నకాలంలో ఠాణా నిర్వహించిన భవనంలో ప్రస్తుతం తహశీల్దారు కార్యాలయాన్ని నిర్వహిస్తున్నారు. ఇందులో ఆనాటి జైలుగదిలో ప్రస్తుతం రికార్డులు భద్రపరుస్తున్నారు. తాండ్రపాపారాయుడు మెడలో ధరించే గొలుసు తహశీల్దారు కార్యాలయంలో ఇప్పటికీ భద్రంగానే ఉంది.